డిజిటల్ టెక్నాలజీల పుణ్యామా అని ప్రస్తుతం తెలుగు సాహిత్య రంగంలో ఒక కొత్త కాంతి కనిపిస్తోంది. ఒకప్పుడు భౌతిక పుస్తకాలు, ప్రింట్ పత్రికలకే పరిమితమైన మన సాహిత్యం, నేడు అంతర్జాలం, సోషల్ మీడియా వేదికలుగా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, కవులు, విమర్శకులు, సాహిత్య ప్రియులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ వెబ్ పత్రికలు, ఫేస్‌బుక్‌ కమ్యూనిటీలు, వాట్సాప్ సమూహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

కవితలు, కథలు, నవలలు, పుస్తక సమీక్షలు, ప్రాచీన-ఆధునిక సాహిత్య విశ్లేషణలు మాత్రమే కాకుండా అనువాద రచనలకు కూడా ఈ-పత్రికలు విస్తృత వేదికను అందిస్తున్నాయి. సాహిత్య అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన, ఫాలో అవ్వాల్సిన కొన్ని ముఖ్యమైన తెలుగు అంతర్జాల సాహిత్య పత్రికలు కింద తెలుపబడ్డాయి.

  1. కథామంజరి (Kathamanjari) – అంతర్జాల పత్రికలలో ఇది నా ఫేవరెట్. ఈమెయిల్ అడ్రసు రిజిస్టర్ చేసుకుంటే, ప్రతి నెలా పది మంచి కథలు పిడిఎఫ్ రూపంలో అందిస్తారు. కథలు ఆడియో రూపంలో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తారు.
  2. సహరి (Sahari): కథలు, కవితలు, సాహిత్య చర్చలు.
  3. ఉదయిని (Udayini): నాణ్యమైన కవితలు, వ్యాసాలు, అనువాద నవలలు మరియు కొత్త పుస్తకాల పరిచయాలకు పేరుగాంచిన ప్రసిద్ధ సాహిత్య పత్రిక.
  4. విహంగ (Vihanga): తెలుగులో మొట్టమొదటి మహిళా ఆన్‌లైన్ సాహిత్య మాసపత్రిక. స్త్రీవాద, సామాజిక సాహిత్య విశ్లేషణలు మరియు కవితలకు ప్రాధాన్యత ఇస్తుంది.
  5. సారంగ (Saaranga): పత్రిక ఆధునిక ఆలోచనలు, సంపాదకీయాలు, విమర్శలు మరియు కథలకు అత్యంత నాణ్యమైన వేదిక.
  6. సంచిక (Sanchika): ప్రతివారం ఆన్‌లైన్‌లో వెలువడే డిజిటల్ పత్రిక. సీరియళ్లు, ధారావాహికలు, కథలు మరియు సాహిత్య సమీక్షలకు ఎంతో ప్రజాదరణ పొందింది.
  7. ప్రతిలిపి తెలుగు (Pratilipi Telugu): వేలాది మంది స్వతంత్ర రచయితలు, పాఠకులు నేరుగా తమ కథలు, నవలలు, కవితలను పంచుకునే అతిపెద్ద ఓపెన్ డిజిటల్ సాహిత్య వేదిక.
  8. కౌముది (Koumudi): అమెరికా నుండి ప్రచురితమయ్యే తొలితరం ఆన్‌లైన్ తెలుగు పత్రికలలో ఒకటి. కథలు, కవితలు, శీర్షికలు మరియు విశేషాలతో సమృద్ధిగా ఉంటుంది.
  9. సంపంగి (Sampangi): ఆసక్తికరమైన సీరియల్ నవలలు, హృద్యమైన కుటుంబ కథలు, చిన్న కథలు, రకరకాల విషయాలపై వ్యాసాలు. సభ్యత్వం తీసుకోవాలి.
  10. ఈమాట (Eemaata): ఇరవై ఐదు సంవత్సరాలు పైగా నడుస్తూ, చక్కటి సాహిత్యంతో అందరికీ తెలిసిన అంతర్జాల పత్రిక.
  11. ప్రజాసాహితి (Prajasahithi): సామాజిక చైతన్యం, అభ్యుదయ ఆలోచనలు మరియు ప్రజల పక్షాన నిలిచే సాహిత్యాన్ని డిజిటల్‌గా ప్రచురించే పత్రిక.
  12. నెచ్చెలి (Neccheli): అంతర్జాల వనితా మాస పత్రిక. డా. కె. గీత గారి సంపాదకత్వంలో, చాలా మంచి నాణ్యత గల కథలు, వ్యాసాలు, కవితలు, విమర్శలు, ధారావాహికలు. తప్పక చదవవలసిన పత్రిక. వాట్సప్ సమూహంలో చేరితే, ప్రతి నెల మీ ఫోనుకే నేరుగా పిడిఎఫ్ అందుతుంది.
  13. మయూఖ (Maykha): తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక.
  14. సిరిమల్లె (Sirimalle): అచ్చమైన తెలుగు వ్యావహారిక భాషలో సాహిత్యాన్ని అందించే ప్రయత్నం.
  15. తపస్వి మనోహరం (Thapasvi Manoharam) : వార పత్రికలు, మాస పత్రికలు, ఈబుక్స్, ప్రింట్ పుస్తకాలు ప్రచురిస్తారు. వీరి యాప్ కూడా ఉంది. అందులో నేరుగా ఉచితంగా చదవవచ్చు.
  16. రవళి (Ravali): వీరికి వెబ్ సైట్ లేదు. సభ్యత్వం తీసుకుంటే, నెల నెలా వాట్సాప్ పంపుతారు. సంపాదకులు రామ్ గారి నెంబర్: 96635 26008.

ఇవి నాకు తెలిసిన పత్రికలు. మీకు ఇంకేవైనా ఇంటర్నెట్ పత్రికలు తెలిస్తే నాకు తెలియజేయండి, వాటిని ఇక్కడ జతచేస్తాను.