తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) సావనీర్, మే 2026

హైద్రాబాదులో ఒక ఫైవ్ స్టార్ హోటల్ డాబా మీదకి చేరాను. నా స్నేహితుడు, ఏడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ ఐటీ సంస్థలో నా సహోద్యోగి సునీల్ యాభై వసంతాలు నిండిన సందర్భంగా పార్టీ. రంగు రంగుల లైట్లు, బెలూన్లు, బార్ కౌంటర్, తెల్లటి యూనిఫాంలో చేతిలో ట్రేలతో అటూ తిరుగుతున్న వెయిటర్లు, పాప్ సంగీతం – పూర్తి పార్టీ వాతావరణం. నేను అడుగుపెట్టగానే నలుగురైదుగురు నా చుట్టూ చేరారు. చాలా మంచి పనులు చేస్తున్నానని, నా లాంటి వారు సమాజానికి అవసరమని అలవాటైన పొగడ్తలతో ముంచేశారు.

విష్ణు! ఒకప్పుడు మంచి స్నేహితుడే కానీ ఏళ్ల తరబడి వాణ్ణి తప్పించుకుంటూ తిరిగాను. ఇప్పుడు మళ్లీ చూడగానే నా పాత గాయాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఏడేళ్ల క్రితం మేమిద్దరం ఒకే వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడ్డాం. మేనేజ్‌మెంట్ విష్ణు‌ను ఎంచుకుంది. నేనా కంపెనీకి రాజీనామా చేసి, మరో కంపెనీలో చేరాను. అక్కడో మూడేళ్లు పని చేశాక, అలాంటి మరో అనుభవంతో, విసుగెత్తి ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నత స్థాయి అధికారిగా చేరాను. ఇక్కడ నన్ను కోట్ల జీతాలు కాదనుకుని ఈ రంగానికి వచ్చానని అందరూ ఎంతో గౌరవిస్తారు. ఆ రంగంలో పనిచేసే అందరిలా ఖద్దరు కుర్తాలు, ఉద్యమకారుల భాష అలవాటు చేసుకున్నాను. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ, ఇంటర్వ్యూలిస్తూ మంచి పేరు సంపాదించాను.

ఎప్పుడైనా ఇలాంటి పార్టీల సందర్భాల్లో నా పాత సహోద్యోగులను కలిసినప్పుడు, వాళ్లు తమ డబ్బు, హోదాలు చూపించుకుంటూ మురిసిపోయే స్వార్థపరులన్నట్లు చిన్నచూపు నాకు.

విష్ణు మాత్రం ఇంకా అదే కంపెనీలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆ కంపెనీ ఇండియా బ్రాంచికి హెడ్డు. సంపాదన కోట్లలో ఉంటుంది. బార్ కౌంటర్లో నేనెప్పుడూ తాగే వోడ్కా కాక్టెయిల్ చేయించుకుని, విష్ణు దగ్గరికి వెళ్లాను.

“విష్ణు! ఎలా ఉన్నావు?” అన్నాను కాస్త గట్టిగానే. పక్కనే ఉన్న అతని భార్య శ్రీదేవిని కూడా పలకరించాను.

విష్ణు పెద్ద నవ్వు ముఖంతో, “హాయ్ రవీ, నిన్ను చూసి చాలా కాలమైంది,” అని కరచాలనం చేసి, కౌగిలించుకున్నంత పని చేశాడు. “స్వచ్ఛంద సంస్థల్లో మంచి పనులు చేస్తున్నావు. చాలా సంతోషం.”

నటించడంలో వీడి తర్వాతే ఎవరైనా. అందుకే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు. అయితేనేం? గర్వంతో నా ఛాతీ ఒక ఇంచి ఉబ్బింది.

“అవును విష్ణు. ఎన్నాళ్లు ఈ కార్పొరేట్ పరుగుల్లో ఎలకల్లా పరుగెడతాం? మరి నీ ప్లాన్స్ ఏమిటి? బాగా సంపాదించి ఉంటావుగా? రిటైర్మెంట్ గాని, కాస్త సంఘ సేవ గాని లేదా? బహుశా జీతం బాగా వస్తున్నప్పుడు, దాని నుంచి తప్పుకోవడం కష్టం కదా?” నా ఖద్దరు షర్టుని సరిచేసుకుంటూ, అతనికంటే నైతికంగా నేను పై స్థాయిలో ఉన్నానని పరోక్షంగా చెప్పేశాను.

శ్రీదేవితో సహా చుట్టూ ఉన్న నలుగురూ అసౌకర్యంగా ఫీలయ్యారు.

విష్ణు మాత్రం గట్టిగా నవ్వేసి, నా భుజం తట్టి, “అందరూ అన్నీ చెయ్యలేరుగా, రవీ! నేనొక వర్కహాలిక్. నాకు ఈ పని తప్ప ఇంకేం తెలియదు. దీన్నే ఎంజాయ్ చేస్తున్నాను,” అని చెప్పి అక్కడి నుంచి చిన్నగా తప్పుకున్నాడు.

**

పార్టీ అయ్యాక వాలెట్ పార్కింగ్ దగ్గరికి వెళ్తే, శ్రీదేవి అక్కడ నిలుచుని ఉంది. విష్ణు ఇంకా లోపలే ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మరోసారి నవ్వుతూ పలకరించాను. ఆమె నాలుగడుగులు నా వైపు వచ్చి,

“రవీ, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. విష్ణు యూట్యూబులో మీ ఇంటర్వ్యూలు చూపించి గొప్పగా చెప్పేవాడు. కానీ మీరు విష్ణు గురించి అలా మాట్లాడ్డమేంటి?” అంది.

నేను ఆశ్చర్యంగా, “నేనేం అన్నాను? కోట్లున్నా ఇంకా ఈ గానుగెద్దు చాకిరి ఎందుకన్నాను. తప్పేముంది?” అన్నాను.

శ్రీదేవి నిట్టూర్చి చెప్పింది. “విష్ణు తన సంపాదనలో యాభై శాతం ప్రతి నెలా ఒక అనాధాశ్రమానికి విరాళంగా ఇస్తాడు. ఆ అనాధాశ్రమం నడిపే స్కూల్లో నేను ఇంగ్లీషు నేర్పుతున్నాను. అంతేకాదు, విష్ణు వాళ్ళ సొంత ఊరిలో మా అత్తగారి పేరుతో ఒక ఉచిత కంటి ఆసుపత్రి నడుపుతున్నాడు. అక్కడ పేదవాళ్లకు పైసా ఖర్చు లేకుండా వైద్యం, ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇదంతా ఆయన ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోడు. ఆయన సంపాదించేది మా పిల్లల కోసం మాత్రమే కాదు రవీ, తన మీద ఆధారపడిన వందలాది మంది పేదవాళ్ల కోసం.”

శ్రీదేవి మాటలు నమ్మలేకపోయాను. అతన్ని సమర్థించడానికే ఇవన్నీ చెబుతోందా? లేదు లేదు, తను అలా అబద్ధం చెప్పే మనిషి కాదు. ఒక్కసారిగా నా అహంకారం పటాపంచలై, ఒక రకమైన అపరాధ భావం తన్నుకొచ్చింది. నా మీద నాకే అసహ్య భావంతో ముఖమంతా ఎర్రబడింది.

**

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి చీకటిని చూస్తూ ఉండిపోయాను. నేను జీతానికి ఒక ఎన్జీవోలో పనిచేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాను. మనసులో మాత్రం స్వార్థం, అసూయ, గుర్తింపు కోసం ఆరాటం. విష్ణు తన కష్టార్జితాన్ని ఇతరుల కోసం ధారపోస్తున్నాడు, ఏ ప్రచారమూ ఆర్భాటమూ లేకుండా. నన్ను నేను గొప్పగా చూపించుకోవాలనే తాపత్రయంలో, అలాంటి మనిషి నిశ్శబ్ద త్యాగాన్ని తక్కువ చేసి చూశాను.

స్వచ్చంధ సేవా రంగం ముసుగులో నా లాంటి ఆర్భాటపు ప్రచారగాళ్లు చాలామంది ఉన్నారు. అలాగే, విష్ణు వంటి నిష్కామ సేవకులు కూడా ఎందరో ఉండి ఉంటారు. లేకుంటే, ఈ దేశంలో వ్యాపారవేత్తల అత్యాశ, రాజకీయ నాయకుల అవినీతి, మతగురువుల స్వార్ధపు మాటల మధ్య నలిగిపోతున్న సామాన్యుడికి ఎవరు దిక్కు? ఇప్పుడు విష్ణు నాకు ఒక పాత గాయంలా కాదు, చీకటిని తొలగించి సరైన మార్గం చూపిన దివ్యజ్యోతిలా కనిపిస్తున్నాడు.

***