తపస్వి మనోహరం అంతర్జాల మాస పత్రిక, ఆగస్టు 2026

ఉదయం ఆఫీసుకెళ్తూ, దారిలో పెట్రోల్ బంక్ దగ్గర బైక్ ఆపాను. యూనిఫాంలో ఉన్న ఒక ముప్పయ్యేళ్ల మహిళ పెట్రోల్ నింపింది. బిల్లు చెల్లించడానికి తన ఫోన్ మీద యూపీఐ క్యూఆర్ కోడ్ చూపించింది. స్కాన్ చేస్తే బంకు పేరు కాకుండా, ‘లక్ష్మి’ అని పేరు వచ్చింది.

నేను ప్రశ్నార్ధకంగా ఆ క్యూఆర్ కోడ్ వైపు చూసి, “ఏమ్మా, ఇది నీ సొంత నంబర్లా ఉంది?” అని అడిగాను.

“అది… సార్… మా కార్డు మెషిన్ పని చేయడం లేదు. సర్వర్ ప్రాబ్లం,” తడబడుతూ జవాబిచ్చింది.

ఇలాంటి సందర్భాల్లో నిజం రాబట్టడానికి నేనొక టెక్నిక్ కనిపెట్టాను. “అవునా? అలా జరగదే? ఈ మెషిన్లు మా కంపెనీవే. మీ ఓనర్ నాకు బాగా తెలుసు. ఒకసారి పిలుస్తావా?”

ఆమె చేతులు వణికాయి. చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమోనని భయంతో దిక్కులు చూసింది. 

“ఇప్పుడు పనిచేస్తుందేమో ఇంకోసారి చూస్తాను సార్,” గొంతు తగ్గించి అంటూ వాళ్ల బంకు మెషిన్లో బిల్లు మొత్తం నొక్కి, నా ముందు పెట్టింది. నేను స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేశాను.

బైకు స్టార్ట్ చేస్తుంటే, “సార్… ప్లీజ్ సార్, మా వోనరుకి ఈ విషయం చెప్పకండి,” అంటూ కళ్లల్లో నీళ్లతో బతిమిలాడింది.

“చూడమ్మా, నిన్ను నమ్మి ఉద్యోగంలో పెట్టుకొని జీతమిచ్చే వాళ్లని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది?” ఆ బంకు ఓనరుకి కలిగే నష్టం గురించి ఆలోచిస్తూ నీతులు వల్లించాను.

“సారీ సార్.. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వారం నుంచి తినడానికి సరైన తిండి లేక నీరస పడిపోతున్నారు. జీతం రావడానికి ఇంకా నాలుగు రోజులుంది. ఎంత అడిగినా ఎవరూ పైసా సర్దుబాటు చేయలేదు. తప్పు అయిపోయింది సార్,” అంటూ చేతులు జోడించింది.

ఆమె మాటల్లో వినిపించిన విషాదంతో, ఆమెను కాస్త క్షుణ్ణంగా గమనించాను. ఆమె ముఖాన వయసుకు మించిన మానసిక ఒత్తిడి, ఎండిపోయిన పెదవులు, కళ్లల్లో నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. 

ఏదైనా డబ్బు సాయం చేయాలని ఒక్క క్షణం అనిపించింది. కానీ ఈ నగర జీవితం నేర్పిన పాఠాలు నన్ను ఆపాయి. ‘ఇలాంటి నాటకాలు ఈ రోజుల్లో ఎన్నో చూస్తున్నాం, వీళ్లని నమ్మితే మనమే మూర్ఖులం అవుతాం’ అనుకున్నాను.

“నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, ఇలా దొంగతనం చేసి నువ్వు దొరికిపోతే నలుగురూ ఏమంటారు? నీకున్న ఈ ఒక్క ఉద్యోగం కూడా పోతుంది. అప్పుడేం పెడతావు పిల్లలకి? నిజాయితీగా కష్టపడాలి కానీ ఇలాంటి పక్క దారులు వెతక్కూడదు” అని క్లాస్ పీకాను.

ఆమె తడిబారిన కళ్లతో మౌనంగా తలదించుకుంది. నా మాటలు కొంచెం ఘాటుగా తగిలి ఆమె కంటి నుండి ఒక నీటి బొట్టు నేలపై పడింది. నాకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. “ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు” అని కాస్త గట్టిగా చెప్పి బైక్ స్టార్ట్ చేశాను.

“రాత్రికి నా బిడ్డలు ఆకలికి ఏడిస్తే… ఈ మాటలు చెప్తే వాళ్ల కడుపు నిండుతుందా సార్?” ఆమె తనలో తానే గొణుక్కుందో, లేక నన్ను నిలదీయడానికే ఆ మాట అన్నదో నాకు అర్థం కాలేదు.

**

ఆఫీస్ పనుల్లో మునిగిపోయినా, లక్ష్మి అడిగిన ఆ ప్రశ్న నా గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చున్నా ఆమె ముఖమే గుర్తుకొచ్చింది.

‘ఒకవేళ… ఆమె నిజమే చెప్పుంటే’ అన్న చిన్న అనుమానం నా మనసుని తొలిచేస్తోంది. కూటి కోసం అలమటిస్తున్న పిల్లల విషయం తెలిసీ ఏమీ సహాయం చేయక పోవడానికి నా మనసు ఒప్పుకోదు.

ఆకలి బాధ అనుభవిస్తే గానీ తెలియదు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ సిటీలో నా తొలి రోజులు కళ్లముందు మెదిలాయి. ఉద్యోగం లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, రెండు రోజులు కడుపు మాడినప్పుడు నాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒక రోజు ఆకలి తట్టుకోలేక ఒక చిన్న రోడ్డు పక్కన బండి వాడి దగ్గర తిని డబ్బులు కట్టకుండా గుంపులో దూరి మాయమయ్యాను. ఒక గంటపాటు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకింకా గుర్తుంది. ఆ రోజు నేను చేసింది కూడా దొంగతనమే, కానీ నా ఆకలి నా చేత ఆ పని చేయించింది. 

ఇప్పుడొక హోదాలో ఉండి, పిల్లల పొట్టకూటి కోసం ఒక తల్లి పడే బాధను అర్థం చేసుకోలేదు. నగర జీవితంలో సాటి మనుషుల్ని, వారి కష్టాల్ని తేలిగ్గా కొట్టిపారేయడం, అవకాశముంటే నాలుగు నీతులు చెప్పడం బాగా అలవాటయింది. 

ఆమెతో మరోసారి మాట్లాడి, నా వంతుగా ఏదైనా ఆర్థిక సహాయం చేసి, సాధ్యమైతే ఆ కుటుంబానికి ఒక దారి చూపించాలని నిర్ణయించుకున్నాను. చేయాల్సిన పని తోచాక, మనసు కాస్త తేలిక పడింది.

**

సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళుతూ, మళ్లీ అదే పెట్రోల్ బంక్ దగ్గర బైక్ ఆపాను. లక్ష్మి కోసం అక్కడ పరికించి చూశాను, కానీ ఆమె కనిపించలేదు.

బైకు ఒక పక్క పార్క్ చేసి, అక్కడ పెట్రోల్ కొడుతున్న ఒక కుర్రాడి దగ్గరికి వెళ్లాను. “తమ్ముడూ… ఇక్కడ పొద్దున లక్ష్మి అని ఒక ఆవిడ డ్యూటీలో ఉంది కదా, తను కనిపించదేం?” అని అడిగాను.

ఆ కుర్రాడు నేనెందుకు అడుగుతున్నానో అర్థం కానట్టు చూసి, “ఓ.. లక్ష్మక్కా సార్? మధ్యాన్నం పెద్ద గొడవే అయింది. ఆ అక్క పెట్రోల్ డబ్బులు రెండొందలు కొట్టేస్తూ సీసీటీవీలో దొరికిపోయింది. మేనేజర్ సార్ అందరి ముందు రచ్చ రచ్చ చేసి, పచ్చి బూతులు తిట్టి, ఈ నెలకు రావాల్సిన జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా ఉద్యోగంలోంచి తీసేసి వెళ్లగొట్టేశారు,” అన్నాడు చాలా బాధగా.

నేను భయపడినంతా జరిగింది. మరీ ఎంత అమాయకురాలు? సీసీటీవీలో, కాకుంటే సాయంత్రం మేనేజర్ లెక్కలు చూసుకున్నప్పుడైనా, సులభంగా దొరికే పోతుందన్న విషయం తెలియదా? లేకుంటే ఇవన్నీ తెలిసే తెగించే చేసిందా? అసలు ఆమె నాకు చెప్పింది నిజమేనా?

“ఆమె నీకు బాగా తెలుసా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసిందా?” అని నా మనసులోని అనుమానం నివృత్తి చేసుకునేందుకు అడిగాను.

“అయ్యో, లేదు సార్! ఆ అక్క పరుల పైసలు ఆశించే మనిషి అస్సలు కాదు. ఆమె మొగుడు ఆటో డ్రైవర్, మూణ్ణెల్ల క్రితం పెద్ద యాక్సిడెంటయ్యి మంచాన పడ్డాడు. దవాఖాన ఖర్చులకి ఉన్న ఆటో కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పాపం, ఇంట్లో పైసలకి బాగా ఇబ్బందయితాంది. మేనేజర్ని అడ్వాన్స్ అడిగితే… ఆయనేమో ‘అప్పిస్తే నెత్తికెక్కి కూర్చుంటావు’ అంటూ తిట్టిపోశాడు. గత్యంతరం లేక, కనీసం రాత్రికి పిల్లల కింత గంజి పోయడానికే అక్క ఈ తప్పు చేసి ఉంటుంది సార్” అని చెప్పాడు.

ఆ కుర్రాడి మాటలు వింటుంటే నా గుండెను ఎవరో గట్టిగా పిండేసి నట్లయింది. పొద్దున ఆమె ఆవేదనను నాటకమని కొట్టిపారేసి, నీతులు చెప్పి ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. కన్న పిల్లల ఆకలి కేకలు తట్టుకోలేక ఆ అభాగ్యురాలు తన నిజాయితీని తాకట్టు పెట్టింది. తనకున్న ఏకైక జీవనాధారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా, కేవలం కన్న పిల్లల కడుపు మంట ఆర్పడం కోసమే ఆ సాహసం చేసింది.

చుట్టూ చూసాను. ఆధునిక సాంకేతికతతో మెరిసిపోతున్న హైటెక్ పెట్రోల్ బంక్ అది. నాలుగు వైపులా సీసీటీవీ కెమెరాలు నిఘా కాస్తున్నాయి. దొంగ దొరికిపోయింది, యాజమాన్యం తన పని తాను చేసింది, క్రమశిక్షణ పేరుతో ఆమెకు శిక్ష పడింది. సిస్టమ్ చాలా కట్టుదిట్టంగా పనిచేసింది.

తప్పు చేసిన వారిని తక్షణమే పట్టుకుని శిక్షించే ఇలాంటి సాంకేతిక వ్యవస్థలను నిర్మించడంలో మనం ఎంతో ఆరితేరుతున్నాం. కానీ, ఆ తప్పు వెనుక ఉన్న ఆకలి కడుపులను అర్థం చేసుకునే కనీస మానవత్వాన్ని మాత్రం పూర్తిగా కోల్పోతున్నాం.

“తమ్ముడూ, ఆ లక్ష్మి ఫోన్ నంబరేమైనా ఉందా?” ఆ కుటుంబానికి నా వంతు సాయం చేయాలనే ఆశతో అడిగాను.

***