స్వాతి సపరివార పత్రిక, జులై 17, 2026

ఉదయం పది. అప్పటికే హైదరాబాద్‌ నగరం వేడెక్కింది. తన బిజీ జీవితాన్ని మొదలు పెట్టింది. 

సలీం తన తెల్లని ఇన్నోవా కారుని మాదాపూర్లోని పెద్ద లగ్జరీ అపార్ట్ మెంట్ ముందు నిలిపి, కస్టమర్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇరవై ఏళ్ల కిందట బి.ఏ. చదువుకున్న సలీంకి పైచదువులు చదివే ఆర్థిక స్తోమత లేదు. వాళ్ల సొంతూరు సంగారెడ్డి నుంచి హైదరాబాదుకి వచ్చి, ఉద్యోగాలు వెదికితే దొరకలేదు. టాక్సీ తోలాడు. పెళ్లయిన తర్వాత, దుబాయికి వెళ్లి అక్కడో పదేళ్లు టాక్సీ నడిపి, కుటుంబానికి దూరంగా ఉండలేక తిరిగి వచ్చేసాడు. 

పొదుపు చేసిన డబ్బుతో పాటు, కొంత అప్పు చేసి, సొంత బండ్లు మూడు కొన్నాడు. ఇన్నోవా తాను నడుపుతూ, చిన్న బళ్ళు ఒకటి తమ్ముడికిచ్చి, ఒకదానికి బయటి డ్రైవర్ని పెట్టుకున్నాడు. 

దుబాయిలో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాడు. అక్కడకి విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు నవ్వుతూ పలకరించే వారు. ఎంతో మర్యాదగా మాట్లాడేవారు. వాళ్ల విషయాలు చెప్పుకుని అతని గురించి అడిగేవారు.

దుబాయి అనుభవంతో, అతనికి డ్రైవర్ వృత్తి ఒక ఇష్టంగా మారింది. ఇక్కడ హైదరాబాదులో కూడా, తన కారెక్కిన ప్రయాణికులని ఎంతో గౌరవంగా పలకరించి, వాళ్లతో మాట కలుపుతాడు. చాలామంది ఉత్సాహంగా మాట్లాడతారు. కొంతమంది చాలా క్లుప్తంగా జవాబిస్తారు.

సలీం సమకాలీన జీవితం, మారుతున్న ప్రపంచం గురించి లోతుగా ఆలోచిస్తాడు. ఆసక్తి చూపించే ప్రయాణికులతో ఆ విషయాలు మాట్లాడుతాడు కూడా. 

ఈ పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టనష్టాలతో పోరాడుతున్నారు. మనం ఎదుటి వారితో కాస్త ప్రేమగా మాట్లాడి, వాళ్ల  మాటలు శ్రద్ధగా విన్నప్పుడు, వారి మనసులో భారం తగ్గుతుంది. మంచి మాట మనసు గాయాలను మాన్పే ఒక అద్భుతమైన ఔషధం. ఇది సలీం అనుభవంతో నేర్చుకున్న నమ్మకం.

సలీంకి వచ్చే గిరాకీల్లో, చాలావరకు పునరావృతమయ్యే కస్టమర్లే. కానీ, ఈ రోజు కొత్త కస్టమర్.

సలీం ఎదురుచూస్తున్న ప్రయాణికులు వచ్చి కారు ఎక్కారు. ఇద్దరు మగవారు – ఒకరికి అరవై ఏళ్ల వయసు, రెండో అతనికి ముప్పై లోపే ఉండవచ్చు. 

తండ్రీ కొడుకులా అని ఆలోచిస్తున్న సలీంకి సమాధానం తొందరగానే దొరికింది. 

“నమస్కారం సార్” అని వాళ్ళని పలకరించి  కారు కదిలించగానే, వారిద్దరి మధ్య చిన్న వాగ్వివాదం మొదలయింది.

“కార్తీక్, ఇది నా ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే శుభకార్యం ఇది,” పెద్దాయన స్వరంలో కాస్త ఆవేదన వినిపించింది.

“నా స్నేహితులు, మన బంధువులు మనం ఎప్పుడు శుభవార్త చెబుతామా అని ఎదురుచూస్తున్నారు. మన ఊళ్ళో, మన కులంలో మనకంటూ ఒక హోదా ఉంది. కనీసం వెయ్యి మందిని పిలిచి, బ్రహ్మాండమైన మంటపాలు వేసి, విందు భోజనాలు పెట్టకుంటే, అందరూ నవ్వి పోతారు. ఇది కేవలం మన ఆనందం కోసం కాదు, సమాజంలో మనకున్న పేరు మర్యాదలు నిలబెట్టుకోవడం కోసం కూడా.”

కార్తీక్ నిట్టూర్చాడు. “డాడీ, ఆ వెయ్యి మందిలో ఒక యాభై మందికి మించి నేను ఎవరో కూడా తెలియదు. ఎవరినో సంతృప్తి పరచడానికి కోట్ల రూపాయలు తగలేయాలా? అనన్య, నేను మాకెలాంటి పెళ్లి కావాలని చాలానే ఆలోచించాం. మాకు ఒక యాభై  మంది ఫ్రెండ్స్ మధ్య, ఒక చిన్న ఫామ్‌హౌస్‌లో, ఒక థీముతో పెళ్లి చేసుకోవాలని ఉంది. డెకరేషన్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. గిరిజనుల ప్రదర్శనలు ఉంటాయి..”

సలీంకి విషయం  అర్థమైంది.

“అసలు పెళ్లి అంటేనే ఒక ఆర్థిక చక్రం కార్తీక్. మనం చేసే ఖర్చు వల్ల బట్టల షాపు వాళ్ళు, నగల వాళ్ళు, వంటవారు, డెకరేటర్లు, పూల వాళ్ళు, బ్యాండ్ మేళం వాళ్ళు, పంతుళ్లు… ఇలా వందల కుటుంబాలు బ్రతుకుతాయి. ఇది ఒక రకంగా మనకున్నది పదిమందితో పంచుకోవడం. పెద్ద పెళ్లిళ్లు లేకపోతే వీళ్లందరి పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు పెద్దాయన.

ఆ పాయింట్ చాలా ఆసక్తికరంగా అనిపించింది సలీంకి. నిజమే, ఒక రకంగా అది శ్రమజీవులకు ఉపాధి కల్పిస్తుంది. కానీ, కార్తీక్ సమాధానం మరోలా ఉంది.

“డాడీ, ఉపాధి కల్పించడానికి వందల మార్గాలు ఉన్నాయి. మనకి దగ్గరలోనే మూసాపేట ఏరియాలో ఒక అనాథాశ్రమం ఉంది. పోయిన బర్త్ డే కి నేను అనన్యతో అక్కడకి వెళ్లినపుడు చూసాను. పిల్లలు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. మనం పెళ్లిలో వడ్డించే వంద రకాల వంటల్లో సగం చెత్తబుట్టలోకి వెళ్తాయి. ఆ వృధా చేసే డబ్బుతో కొన్ని వందల మంది పిల్లల చదువుకు, తిండికి సహాయం చేయొచ్చు. పెళ్లి అంటే రెండు మనసుల కలయిక, అది ఒక ‘ఎగ్జిబిషన్’ కాకూడదు.”

పెద్దాయన  కాస్త ఎమోషనల్ అయ్యారు. “కార్తీక్, నువ్వు అనన్యను ఇష్టపడ్డానని చెప్పినపుడు, కులం, మతం పక్కన పెట్టి నేను ఒప్పుకున్నాను కదా? నీ ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చాను. కనీసం పెళ్లి విషయంలోనైనా నా మాట వినకూడదా? అనన్య తల్లిదండ్రులు పెళ్లి ఖర్చు భరించలేరని చెబితే, మనం పెట్టుకుందామని నేనే చెప్పాను. గత ఐదేళ్ల నుంచి నేను, మీ మమ్మీ, నీ పెళ్లి ఘనంగా చేయాలని ఎంతో అనుకున్నాం రా.”

సలీంకి ఆయన మాటల్లో ఉన్న తండ్రి ప్రేమ స్పష్టంగా కనిపించింది. కానీ కార్తీక్ వాదన కూడా బలంగా ఉంది.

“నాన్నా, మీరు నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు, దానికి నేను రుణపడి ఉంటాను. కాని, ఆ విషయాన్ని సెంటిమెంటల్ గా ఇప్పుడు తీసుకొస్తే, మనం ఒక క్రమ పద్ధతిగా మాట్లాడుకోలేము.”

అని, కాస్త ఆగాడు.

 “మమ్మీ చెప్పిన ప్రకారం మొత్తం మూడు ఫంక్షనులు – నలుగు, పెళ్లి, రిసెప్షను. చిన్న విషయం కాదు. లక్షల్లో ఖర్చు. మీరు నా పెళ్లి పేరుతో ఉన్న డబ్బు ఖర్చు పెట్టడం నాకెలా ఉంటుందో ఆలోచించండి. తన్వీకి కూడా చదువు ఖర్చులు ఉన్నాయి. ఆ తర్వాత సొంత బిజినెస్ అంటోంది. దానికి మీ సహాయం అడగవచ్చు…”

“అంటే ఏమిట్రా, ఆమాత్రం ఖర్చు పెట్టే స్థితిలో మనం లేమనా?” కాస్త కోపంగానే ఉన్నట్టున్నాడు పెద్దాయన.

“అలా కాదు డాడీ. మనకి నిజంగానే అవసరమనిపిస్తే, నా శాలరీ మీద లోన్ తీసుకుని అయినా ఖర్చు పెట్టవచ్చు. కానీ, సాధ్యమైనంత తొందర్లో ఒక మంచి ఫ్లాట్ కొనుక్కోవాలని, యూరోప్ చూడాలని అనుకుంటున్నాం. మాకు ఆ మెమరీస్ ఎక్కువ ముఖ్యం.”

పెద్దాయన ఏమి చెప్పాలో తెలియకేమో, మౌనంగా కారు విండో ద్వారా బయటకు చూస్తున్నారు. 

‘తన్వీ అంటే ఆ పెద్దాయన కూతురు అయివుండొచ్చు’ అనుకున్నాడు సలీం. ‘ఈ అబ్బాయి చాలా పరిణతితో ఆలోచిస్తున్నాడు. తన పెళ్లి పేరుతో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టొద్దని తండ్రికి చెపుతున్నాడు. ముందు రాబోయే అవసరాల గురించి మాట్లాడుతున్నాడు. ఆర్భాటాల కంటే అనుభవాలు తనకి ముఖ్యమని చెపుతున్నాడు.’

కార్తీక్ అకస్మాత్తుగా సలీంతో మాట కలిపాడు – “అంకుల్.. మా మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ విషయంలో?”

సలీం బిత్తరపోయాడు – ‘ఇదేమిటి ఇలా అడిగేశాడు ఈ అబ్బాయి – వాళ్ళ సొంత విషయాల గురుంచి నా అభిప్రాయంతో ఏం పని?’

సలీం ఏదో చెప్పబోయే లోపు వాళ్ళ నాన్నే అడ్డుపడి “కార్తీక్?!” అన్నాడు.. ఆయన ఏ ఉద్దేశంతో ఆలా ఆపాడో సలీంకి పూర్తిగా అర్థం కాలేదు. ఇలా అపరిచితుడిని మన సొంత విషయాలగురించి అడిగి ఇబ్బంది పెట్టొద్దనా? లేకుంటే, ఒక డ్రైవరుకి ఇలాంటివి ఏమి తెలుస్తాయనా? 

కార్తీక్ ఆయన మాట వినలేదు. “అంకుల్, నేను గమనించాను, మీరు ఏదో ఆలోచిస్తున్నారు.. మా సంభాషణ గురించే అని నాకనిపిస్తోంది.”

ఈ జనరేషన్ పిల్లలకి సోషల్ స్టేటస్ పట్టింపు తక్కువ అని మనసులో అనుకుంటూ.. 

“అయ్యో.. అలాంటిదేమి లేదు సార్.” అన్నాడు సలీం కాస్త సంశయంతో. 

“మీకు చెప్పేటంత వాడిని కాను.. కానీ, నా మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయో మాత్రం చెబుతాను! మీనాన్నగారి మాటలు, మీ మాటలు రెండూ నాకు నిజమనిపిస్తున్నాయి.. ఏదైనా మధ్యేమార్గం ఉందా అని ఆలోచిస్తిన్నాను, అంతే సార్.”  

సలీం మాటలు విన్నాక ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. పెద్దాయన ముఖం మీద ఆయన మనసులో సామాజిక హోదాకి, కొడుకు సంతోషానికి మధ్య జరుగుతున్న యుద్ధం కనబడుతోంది.

చివరికి, పెద్దాయన కార్తీక్ తొడ మీద చేయి వేసి అన్నారు – “సరే రా, మనం అతిథుల సంఖ్య తగ్గిద్దాం, పెళ్లి నువ్వు చెప్పినట్లు చిన్న ఫంక్షన్ లా చేసి, రిసెప్షన్ మాత్రం అందరూ గుర్తుంచుకునేలా కాస్త గ్రాండుగా చేద్దాం. పెళ్లి ఖర్చు నువ్వే పెట్టుకుంటానంటే అలాగే కానివ్వు. రిసెప్షన్ మాత్రం ఈ సంతోషంలో నేనిచ్చే పార్టీ అనుకొని నాకు వదిలెయ్యి. ఇది ఒక రకంగా ఎక్స్పరిమెంట్. చాలా మంది చాలా ప్రశ్నలడుగుతారు. కానీ మనమే ఒక కొత్త ట్రెండు ప్రారంభిద్దాం. ఏమంటావు?”

కార్తీక్ చాలాసేపు జవాబు చెప్పలేదు. 

‘ఇదేంటి, ఈ జనరేషన్ పిల్లలు పెద్దవాళ్ళ కోసం అసలు తగ్గరా? అన్నీ వాళ్ళు అనుకొనేటట్లు మాత్రమే జరగాలా?’ సలీం ఆలోచనలు ఎంతో దూరం పరుగెత్తక ముందే, కార్తీక్ అన్నాడు – “సరే డాడీ.. నాక్కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుంది.. థాంక్యూ సో మచ్!” అన్నాడు.

పెద్దాయన ముఖంలో చిన్న చిరునవ్వు. రేర్ వ్యూ మిర్రర్ లో సలీంకి కనిపించింది.

కాని.. అంతలోనే ఇద్దరూ ఏంటి మౌనంగా అయిపోయారు? 

చాలాసేపు నిశ్శబ్దం.

సలీంకి అర్ధం కాలేదు. ఇంతకీ వీళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారా, లేక ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారా?

“మీ అమ్మని ఎలా ఒప్పించాలి రా?” అసలు విషయం ఇంకా ఉంది అన్నట్లున్నాయి ఆ పెద్దాయన మాటలు.

“ఈ సారికి అది నాకు వదిలెయ్యండి డాడీ.. ఎంత లేదన్నా నా పెళ్లి కదా!” చిరునవ్వుతో అన్నాడు కార్తీక్.

ఆ మాటలకి కాస్త గట్టిగానే నవ్వాడు పెద్దాయన.. 

వాళ్లిద్దరూ కారు లోకెక్కిన తర్వాత మొట్ట మొదటిసారి కొంచం వాతావరణం చల్లబడింది.

“ఈ ప్రపంచంలో మీ అమ్మని ఒప్పించగల సాహస జీవి ఎవరైనా ఉంటే అది నువ్వొక్కడివేరా!”

కార్తీక్ కూడా నవ్వేశాడు.. “రెండు మూడు సార్లు నువ్వు కూడా నన్ను వాడుకున్నావు డాడీ.. మమ్మీని ఒప్పించడానికి.”  

“అవున్రా.. ఐ విల్ మిస్ యు.. బెంగుళూరు వెళ్ళాక వారానికొకసారైనా ఫోన్ చేయడం మర్చిపోకు.”

సలీంకి ఏదో తెలియని సంతోషం కలిగింది. 

వాళ్లిద్దరూ ఆదర్శవంతమైన తండ్రీకొడుకులు అనిపించారు. ఎదిగిన కొడుకు ఇష్టాయిష్టాలకు గౌరవం ఇచ్చే తండ్రి. ఏదైనా విభేదాలు వస్తే ఓపికగా మాట్లాడి పరిష్కరించుకొనే కొడుకు. 

ఒకరి అభిప్రాయాలకి ఒకరు విలువనిస్తూ, స్నేహితుల్లా బతుకుతున్నారు.

***

ఆ సాయంత్రం సలీం తన డైరీలో ఇలా రాసుకున్నాడు:

ఈ రోజు నా కారులో రెండు తరాలు ప్రయాణించాయి. 

తండ్రి సామాజిక బాధ్యత గురించి ఆలోచిస్తే, కొడుకు వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇచ్చాడు. 

పాత తరం ‘లోకం’ కోసం బ్రతికితే, కొత్త తరం ‘అర్థం’ కోసం వెతుకుతోంది. 

సంభాషణ మరియు సానుభూతితో వినడం ద్వారా తరాల మధ్య ఉన్న అంతరాలను తొలగించవచ్చు. మనసు విప్పి మాట్లాడటం వల్ల ఎంత సమస్యకైనా పరిష్కారం తప్పక దొరుకుతుంది.

తండ్రి తన అధికారాన్ని వదులుకొని స్నేహితుడిగా మారడం, కొడుకు తండ్రి భావోద్వేగానికి విలువ ఇవ్వడం – ఇదే ఆదర్శనీయమైన తండ్రీ కొడుకుల అనుబంధం.